పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలి

* ఉపాధ్యాయుల పట్ల వివక్ష పనికిరాదు

* పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులను వెంటనే చెల్లించాలి

* యు ఎస్ పి సి మహా ధర్నాలో నాయకుల డిమాండ్

హైదరాబాద్, మార్చి 28 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి మంచిది కాదని, ఎన్నో పథకాలకు వేల కోట్లు కెటాయించే ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం మూడవందల కోట్లు కెటాయించలేక పోవటం ఏమిటని యు ఎస్ పి సి నాయకులు ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొని పలువురు నాయకులు మాట్లాడారు. కెటాయించిన బడ్జెట్ ఉన్నప్పటికీ గత మూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వక పోవటం సిగ్గుచేటన్నారు. ధనిక రాష్ట్రమని, ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తున్నామని పదే పదే చెప్పుకునే పాలకులు సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, టిఎస్జిఎల్ఐ, జిపిఎఫ్ క్లైములు, పిఆర్సీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు తదితర బిల్లులన్నీ నెలల తరబడి మంజూరు చేయకపోవటంవలన ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. మరో పిఆర్సీ గడువు సమీపిస్తున్నా పద్దెనిమిది వాయిదాల్లో ఇస్తామన్న రెండు నెలల గత పిఆర్సీ బకాయిలు పదకొండు నెలలు గడిచినా కేవలం మూడు, నాలుగు కు మించి జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపుకొస్తున్నందున ట్రెజరీల్లో పాసైన అన్ని బిల్లులకు సంబంధించిన నగదును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేటందుకు ఆర్థిక శాఖ చొరవ చూపాలని యూనియన్ నాయకులు నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీల్లో పాసై ఆర్థిక శాఖ వద్ద నెలల తరబడి పెండింగులో ఉన్న బిల్లులన్నీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో ఈ మహాధర్నా ను నిర్వహించారు. యు ఎస్ పి సి ప్రధాన డిమాండ్స్1. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు ఇవ్వాలి. 2. ట్రెజరీల్లో పాసై ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న సప్లిమెంటరీ వేతనాలు, పిఆర్సీ బకాయిలు, డిఎ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవు వేతనాలు, పెన్షనరీ బకాయిలు, టిఎస్ జిఎల్ఐ, జిపిఎఫ్ క్లైములు తదితర బిల్లులన్నింటినీ మార్చి 31 లోగా విడుదల చేయాలి. 3. ఎయిడెడ్ టీచర్లకు మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ప్రతిపాదించారు. ధర్నాలో యు ఎస్ పి సి స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం రవీందర్ చావ రవి, ఎం సోమయ్య, ఎన్ యాదగిరి, వై విజయకుమార్, ఎస్ హరికృష్ణ, బి కొండయ్య, నజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణమూర్తి, భద్రయ్య వివిధ జిల్లాల నాయకులు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.