చేగుంట, ఆగస్టు 18 (ప్రజా శంఖారావం): మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు శుక్రవారం రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో వరి పంటలలో కాండం తొలుచు పురుగు సోకడం అక్కడక్కడ గమనించినట్లు చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వరి పంటపై కాండం తొలిచే పురుగు ఉదృతి ఎక్కువగా ఉందని అన్నారు. దీని నివారణ కోసం రైతులు ఒకే పంట వేయకుండా పంటల మార్పిడి చేయాలని ఆయన సూచించారు. అలాగే పంట పిలక దశలో ఉన్న వరిపై ఎకరాన కార్గోప్యూరన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరన్ ట్రానిలిప్రోన్ 4జి గుళికలు 4 కిలోలు వేయాలని సూచించారు. లార్వా దశలో వరి పైరును నష్టపరిస్తే కార్ట్ప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్టి 400 గ్రాములు లేదా క్లోరన్తరిన్ లిప్రోలు 60 మిల్లీమీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, ఏఓ నరేందర్, గ్రామ రైతులు అంజిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.