బజార్హత్నూర్, సెప్టెంబర్ 03 (ప్రజా శంఖారావం):
బజార్ హత్నూర్ మండలం చింతల సాంగ్వి గ్రామానికి చెందిన ఆదివాసీ గోండ్ కులానికి చెందిన సిడం ప్రవళిక ఇటీవల నిర్వహించిన నిట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించి, ఖమ్మం లోని వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించింది. ఈ సందర్బంగా ఆదివారం బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్ వారి గ్రామానికి వెళ్లి విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా శాలువాతో సన్మానించి అభినందించారు. బోథ్ సీఐ విద్యార్థినికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన లీగల్ సెల్ క్యాంపులో విద్యార్థులు, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో కుల, మతలతో సంబంధం లేకుండా చదువనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ఒక మారుమూల ఆదివాసీ విద్యార్థినిని సాధించిన ఘనతను చూసి మిగిత విద్యార్థులు, గ్రామస్తులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే గ్రామంలో ఏమైనా పోలీసు కేసులు ఉంటే ఈనెల 9 న నిర్వహించనున్న జాతీయ లోక్ ఆదాలత్ లో పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్, సిఐ మల్లేష్, సర్పంచ్ ప్రకాష్, ఎస్ఐ నరేష్, ఎంపిటిసి లక్ష్మి, గ్రామ పటేల్, ఉపాధ్యాయుడు శ్రీనివాస్, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.