బిజెపి బరిలో మరో నేత తెరపైకి..?

* బిజెపి బీసీ మంత్రం ఫలించేనా..?
* బీసీ సామాజిక వర్గ నేత తెరపైకి..?
* నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు..!

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 22 (ప్రజా శంఖారావం):

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ హై కమాండ్ బీసీ మంత్రంతో ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాసనసభకు పోటీ చేసే బిజెపి అభ్యర్థుల జాబితాలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం, తాము బీసీలకే పెద్ద పీట వేస్తామని చెప్పకనే చెబుతున్నారు. రాష్ట్రంలో బిజెపి అత్యధిక సీట్లు గెలిస్తే బీసీ నేతనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తామని కూడా బిజెపి పెద్దలు వెల్లడించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి ఈపాటికి రెండు మూడు దఫాలుగా బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘ సమాలోచనలు చేసిన నేపథ్యంలో బిజెపి మొదటి లిస్టును నేడో రేపో విడుదల చేయనున్నారు. అధికారికంగా అధిష్టానం బీజేపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించకపోయిన కొన్నిచోట్ల ముఖ్య నాయకులు బరిలో ఉంటారని సంకేతాలు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెడ్డి సామాజిక నేతలను బరిలోకి దింపిన తరుణంలో బిజెపి పార్టీ మాజీ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గ నేతను బరిలోకి దింపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో బీసీ గానంతో పాటు ఆ సామాజిక వర్గం ఓట్లు తమకు కలిసివస్తాయని రాష్ట్ర అధినాయకత్వం లెక్కలు వేస్తుంది. ఇదే జరిగితే ఆర్మూర్ నియోజకవర్గంలో బీసీ నేత బరిలో ఉంటారన్నది సుస్పష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ ను రెండు దఫాలుగా ఓడించిన నేత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, యెండల లక్ష్మీనారాయణ ఆర్మూర్ బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.