* కోడ్ ఉల్లంఘనకు అధికారులే తెరలేపారా?
* ఎన్నికల అబ్జర్వర్ లేకపోవడం అధికారుల అలసత్వమా?
* స్ట్రీట్ కార్నర్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవచ్చా?
ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 25 (ప్రజా శంఖారావం):
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు కోడ్ ఉన్న విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారని, ఇక్కడ తీరును చూస్తే ఎన్నికల కోడ్ ఉందా అన్న అనుమానం కలుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ఒక కాలనీలో ఉన్న స్ట్రీట్ కార్నర్ బోర్డుపై స్థానిక ఎమ్మెల్యే పేరు ఉండడం ఇప్పుడు చర్చనీయంశమైంది. పట్టణ కేంద్రంలోని డివైడర్ లో ఉన్న చెట్లకు గులాబీ రంగు ఉంటేనే తీసేసిన అధికారులు, స్ట్రీట్ కార్నర్ బోర్డ్ లపై ప్రధాన కూడలిలో అధికార ప్రజాప్రతినిధుల పేర్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో వీధి బోర్డులు ఉండడం కోడ్ పరిగణలోకి రాదా అని పట్టణ ప్రజలు అంటున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధుల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానిక అధికారులే ఉల్లంఘనకు తెరలేపారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్లు లేకపోవడం స్థానిక ఎన్నికల అధికారుల అలసత్వానికి కారణంగా ప్రజలు భావిస్తున్నారు. ఎవరికివారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు (కోడ్) విధించి లాభమేంటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. వేచి చూడాలి ఈ ఘటనపై ఎన్నికల అధికారులు ఏ మేరకు స్పందిస్తారో.