నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రజా శంఖారావం):
రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దులలో ఎస్ ఎస్ టి టీం తోపాటు పోలీస్ సిబ్బందిని ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది మొద్దు నిద్రలో ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతం మెండోర మండలం దూదిగాం గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద “ప్రజా శంఖారావం” కెమెరాకు ఆదివారం ఉదయం ఈ దృశ్యం చిక్కింది. ప్రతినిత్యం జాతీయ రహదారిపై వందలాది వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సిన తనిఖీలను అశ్రద్ధ చేస్తూ ఒక్క వాహనాన్ని కూడా ఆపకుండా ఎవరికివారు సెల్ఫోన్లో నిమగ్నమై ఉండిపోయారు. కెమెరామెన్ గా ఉన్న వ్యక్తి నిద్రపోతున్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయాల్సిన ఎస్ ఎస్ టి టీం అధికారి తన మొబైల్ ఫోన్లో బిజీగా ఉంటూ అలాగే కూర్చుండిపోయిన దృశ్యం కళ్లకు కనబడింది. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేయాల్సిన సిబ్బంది మొద్దు నిద్ర వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ చేయాల్సిన సిబ్బంది అశ్రద్ధ వహిస్తే ఎన్నికల నేపథ్యంలో ధన ప్రవాహం, మద్యం ప్రభావం జిల్లా సరిహద్దులు దాటి జిల్లాలోకి ప్రవేశించి ఎమ్మెల్యే లుగా పోటీచేసే అభ్యర్థుల రహస్య స్థావరాలకు చేరుతుంది. దీంతో నవంబర్ 30న జరిగే ఎన్నికల పోలింగ్ రోజు కంటే ముందు ఆయా నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ల పై మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందన్న విషయం తెలిసి కూడా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిద్రావస్థలో ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద అక్కడ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకున్ని ప్రజలు ఎన్నుకోవాలి అంటే అభ్యర్థుల ప్రలోభాలను అడ్డుకట్ట వేయాలి. సరిహద్దులో మొద్దు నిద్రలో ఉన్న సిబ్బందిపై ఉన్నత అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.