గతంలో పనిచేసిన ఉద్యోగికే ఇంచార్జీ బాధ్యతలు

*ఆ ఉద్యోగి పక్క జిల్లా నుండి మళ్ళీ ఇక్కడికి డిప్యూటేషన్
*మెప్మా పీడీకి ఇంచార్జీ….భీంగల్ కమీషనర్ బాధ్యతలు
*ఎన్నికల కోడ్ లోను తిరిగి అక్కడే విధుల నిర్వహణ!
* ఎన్నికల నేపథ్యంలో కోడ్ నిబంధనలు వర్తించవా?
* శాసనసభ ఎన్నికల్లో ఆ ఉద్యోగి ప్రభావం ఉంటుందని ఆరోపణ?
* ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుండి అక్కడే తిష్ట వేసిన ఉద్యోగి?
*ఆ ఉద్యోగి బదిలీల్లో ఓ కీలకనేత హస్తం..?

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి/ భీంగల్, నవంబర్ 02 (ప్రజా శంఖారావం):

రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో స్థానికంగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల బదిలీలు జరిగిన విషయం విధితమే. అంతకుముందు బదిలీల్లో స్థానికంగా ఉన్న కొందరు తహసీల్దార్లకు పదోన్నతులలో ఆర్డీవోలుగా పదవులు పొందారు. ఈ నేపథ్యంలో గతంలో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం తహసీల్దార్ గా ఉన్న ఉద్యోగికి ఆర్డీవో పదోన్నతి పై కరీంనగర్ జిల్లాకు బదిలీ అయి వెళ్లారు. కానీ ఆ ఉద్యోగి బదిలిలో అధికార పార్టీ కీలక నేత చక్రం తిప్పి తిరిగి నిజామాబాద్ జిల్లాకు డిప్యూటేషన్ పై తీసుకొచ్చి మెప్మా పీడీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ఆ ఉద్యోగి గతంలో భీంగల్ మండల తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో భీంగల్ పట్టణ మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. పక్క జిల్లాకు బదిలీ అయి వెళ్లిన తిరిగి నిజామాబాద్ జిల్లాకు ఇన్ చార్జి మెప్మా పీడీగా వచ్చిన స్థానికంగా పనిచేసిన మండల కేంద్రంలోనే మున్సిపల్ కమిషనర్ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న అధికారులను ఎన్నికల నియమనిబంధన ప్రకారం బదిలీలు చేశారు. కానీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తిరిగి గతంలో పనిచేసిన మండల కేంద్రంలోనే ఆయనకు మళ్ళీ ఇంచార్జీ కమిషనర్ బాధ్యతలు ఇవ్వడం ఏంటని పలువురు ప్తశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ వెలువడక ముందు పని చేసిన స్థానిక మండల కేంద్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన పనితీరు ప్రభావం ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్కడ పని చేస్తున్న తాహసీల్దార్ కు లేదా జిల్లాలోని మరో మున్సిపల్ కమిషనర్లకు అక్కడి ఇంచార్జీ కమిషనర్ బాధ్యత ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సదరు అధికారి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మున్సిపల్ కార్యాలయంలో తిష్ట వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులకు సహకారం ఉంటుందన్న ఉద్దేశంతోనే తిరిగి అక్కడ ఆ ఉద్యోగిని నియమించుకున్నట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. మరి ఎన్నికల నియమ నిబంధనలను జిల్లా అధికారులే ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.

జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి వివరణ:

ఎన్నికల కోడ్ వెలువడకన ముందే ఆ ఉద్యోగి నిజామాబాద్ జిల్లా నుండి పక్క జిల్లాకు పదోన్నతి పై బదిలీలో వెళ్లారు. ఈ నేపథ్యంలో తిరిగి మెప్మా పిడి ఇంచార్జి బాధ్యతలు ఆయనకు ఉన్నతాధికారులు అప్పగించారు. కానీ ఎన్నికల కోడ్ పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశం. ఎన్నికలకు మెప్మా పిడి తో సంబంధం ఉండదు. మీరు(పాత్రికేయులు) అడిగినట్లు దీని(ఈ సందేహం)పై నాకు కూడా క్లారిటీ లేదు. తెలుసుకొని చెబుతాను.

Leave A Reply

Your email address will not be published.