క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలి: కామారెడ్డి ఎమ్మెల్యే

కబడ్డీ పోటీలు విజయవంతమయ్యే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్

కామారెడ్డి, జనవరి 07 (ప్రజా శంఖారావం):

భారతదేశ క్రీడాకారులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ 2024 కబడ్డీ టోర్నమెంటును ఆదివారం రాత్రి కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని అన్నారు. ఓటమి చెందిన వారు తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని చెప్పారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు ఎస్ జి ఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడల నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ లు క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలను అధికారులు కల్పిస్తారని చెప్పారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కామారెడ్డిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు విజయవంతమయ్యే విధంగా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడికి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు. క్రీడలను నిర్వహణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు. క్రీడాకారుల నుంచి ఎమ్మెల్యే, కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈనెల 7 నుంచి 11 వరకు క్రీడ పోటీలు జరుగుతాయి. 29 రాష్ట్రాలకు చెందిన 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇఓ రాజు, జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఎస్.జి.ఎఫ్ జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్, రాష్ట్ర ఎస్జీఎఫ్ కార్యదర్శి రామ్ రెడ్డి, దాతలు పైడి ఎల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.