G-L53TNVHN5Y సెలవుల్లో సర్వేయర్లు | Praja Shankaravam

సెలవుల్లో సర్వేయర్లు

* డిప్యూటి ఇన్స్పెక్టర్ గా అదనపు ఇంచార్జీ బాధ్యతలు

* పని ఒత్తిడితో సెలవుల్లోకి ?

* ఆరోగ్య సమస్యలకు పని ఒత్తిడే కారణమా!

* నిలిచి పోయిన భూమి కొలతల పనులు

* జిల్లా కేంద్రంలో ఒకేచోట ఇద్దరేసి డి.ఐ లు !

* ఖాళీల భర్తీల్లో ఎందుకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం?

ఆర్మూర్, జనవరి 23 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్లో భూమి కొలతల శాఖలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కొన్నిచోట్ల మండల సర్వేయర్లు లేకపోవడం మరికొన్ని కొన్నిచోట్ల ఉన్న సర్వేయర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు పని ఒత్తిడి కల్పించడంతో మండల సర్వేయర్లు సెలవుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆర్మూర్ మండల సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సదరు సర్వేయర్ మండలంలో ఉన్న గ్రామాలలోని భూమి కొలతలతో పాటు ఆర్మూర్ అర్బన్ కు సంబంధించిన భూమి కొలతలు, ఇరిగేషన్, నేషనల్ జాతీయ రహదారులు, ఉన్నత అధికారుల వద్దకు వచ్చే భూమి కొలతల సమస్యలు, గ్రామాల సరిహద్దుల కొలతలతో పాటు స్థానిక రాజకీయ నాయకులు చెప్పే భూమి కొలతల పనులతో ఇప్పటికే సదరు మండల సర్వేయర్ చిక్కడు దొరకడు అని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. దీనికి తోడు సుమారు 10 నెలలుగా ఆయన డి.ఐగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటు మండల సర్వేయర్ గా, ఇన్చార్జి డి.ఐగా విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యల కారణంగా గడిచిన 15 రోజులుగా ఆయన సెలవుల్లో ఉన్నట్లు సమాచారం. దింతో అర్జీదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు పేరుకుపోయాయి. ఇదే దారిలో కొత్తగా ఏర్పడిన ఆలూరు మండల సర్వేయర్ కూడా పని ఒత్తిడి కారణంగా గత రెండు నెలలుగా సెలవులో ఉన్నట్లు తెలిసింది. ఉన్నత అధికారులు అప్పగిస్తున్న అదనపు బాధ్యతలు కాదనలేక పని ఒత్తిడితో సతమతమవుతూ ఆరోగ్యపరంగా సమస్యలకు లోనవుతున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్న లేని చోట్ల అధికారులను భర్తీ చేయడంలో ఉన్నతాధికారులు అలసత్వం కనబరుస్తూన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆరోగ్య సమస్యలపై ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్ళబోసుకున్న ఫలితం లేకపోవడంతో మండల సర్వేయర్లు సెలవులు పెట్టి ఆరోగ్య సమస్యలపై చికిత్స చేయించుకుంటున్నారు.

జిల్లా కేంద్రంలో ఇద్దరు డి.ఐ లు

జిల్లా కేంద్రంలో ఇద్దరు డిఐలు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్మూర్ డిఐగా విధులు నిర్వహించిన అధికారి పై పలు ఆరోపణలు రావడంతో అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భూమి కొలతల రీజినల్ డైరెక్టర్ కి సరెండర్ చేయాలని స్థానిక ఆర్డీవోను ఆదేశించారు. కానీ ఇద్దరి అధికారుల మధ్య ఉన్న సాహిత్యంతో జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ డైరెక్టర్ భూమి కొలతల అధికారికి అప్పగించడంతో ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు పరమార్లు ఫిర్యాదులు వెళ్లిన పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో రెగ్యులర్ డిఐగా విధులు నిర్వహిస్తున్న మరో అధికారి జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలుగా అక్కడే తిష్ట వేశారు. ఉన్నత అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో ఆయన దిట్ట. జిల్లా కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ భూమి కొలతల అధికారిగా ఎవరొచ్చిన సదరు డి.ఐ మచ్చిక చేసుకోవడంలో అందె వేసిన చెయ్యిగా ఆయనకు పేరుంది. దీనికి తోడు సదరు అధికారికి ఓ ప్రముఖ ఉద్యోగ నేత అండదండలు పుష్టిగా ఉండడంతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. ఇలా ఉన్నచోటే ఇద్దరేసి అధికారులు ఉండడం, లేనిచోట ఇన్చార్జి అధికారులను నియమిస్తూ ఉన్నతాధికారులు వేడుక చూస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఖాళీల భర్తీల్లో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం?

ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లోని ఏర్గట్ల, ఆలూర్ మండల కేంద్రాలలో సర్వేయర్లు లేకపోవడంతో ఆ మండలంలోని భూమి కొలతల పనులు నిలిచిపోయి సదరు రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్మూర్ మండల సర్వేయర్ కూడా సెలవుల్లోకి వెళ్లిపోవడంతో మూడు మండలాల్లోని భూమి కొలతల పనులు నిలిచిపోయి అర్జీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అర్జీదారులు మండిపడుతున్నారు. ఒకే అధికారి ఉండాల్సిన చోట ఇద్దరు ముగ్గురితో పనులు చేయిస్తూ లేని చోట ఖాళీలను భర్తీ చేయకుండా మండల సర్వేయర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో వారు సెలవుల్లోకి వెళ్లిపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అర్జీదారులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు ఖాళీలను భర్తీ చేసి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వేచి చూడాలి అధికారులు ఏ మేరకు స్పందిస్తారో.

Leave A Reply

Your email address will not be published.