G-L53TNVHN5Y సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడు బలి | Praja Shankaravam

సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడు బలి

ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

సైబర్ మోసగాళ్ల వేధింపులకు ఓ యువకుడి నిండు ప్రాణం బలైపోయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన నాగరాజు (19) తన మొబైల్ ఫోన్లో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం గుర్తు తెలియని కొందరు సైబర్ మోసగాళ్లు ఆ యువకుడికి ఫోన్ చేసి నిషేధిత ఆప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నావని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరించారు. తాము సిబిఐ అధికారులమని నిషేధిత ఆప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నావని ఫోన్, మెసేజ్ లు చేస్తూ పోలీసు కేసు నమోదు చేస్తామని బెదిరించారు. భయపడ్డ ఆ యువకుడు వారి వేధింపులు తట్టుకోలేక 3 వేల రూపాయలను వారికి పంపించాడు. ఇదే అదునుగా భావించిన సైబర్ మోసగాళ్లు పదేపదే ఫోన్ చేస్తూ డబ్బులు పంపాలని ఆ యువకుడ్ని వేధించినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఈనెల 18న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు యువకున్ని నిజామాబాద్ లోనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆ యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు సైబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.