G-L53TNVHN5Y రాజీనామా యోజనలో ఎమ్మెల్సీ..? | Praja Shankaravam

రాజీనామా యోజనలో ఎమ్మెల్సీ..?

 

* 40 ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న..!
* ఎమ్మెల్యే చేరికపై ఎమ్మెల్సీ అసంతృప్తి
* ప్రాణం పోయినా పార్టీని వీడను..!
* సన్నిహితుల వద్ద ఎమ్మెల్సీ భావోగ్వేదం..!

జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 24 (ప్రజా శంఖారావం):

MLC considering resignation… 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని అనుక్షణం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, నిరంతరం ప్రజాసేవకే తరిస్తూ జగిత్యాల జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అలాంటి ఆయనకే కాంగ్రెస్ పార్టీలో ఎదురుగాలి వీస్తుందా..? అంటూ పార్టీ కార్యకర్తలు అయోమయానికి లోనవుతున్నారు. జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో, గత ప్రభుత్వ హయాంలో పార్టీ గొంతును బలంగా వినిపించారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనను ఎండగడుతూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గలం వినిపించారు. జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ పై తన దిక్కారస్వరాన్ని, ఎమ్మెల్సీ గా శాసనమండలిలో స్థానిక సమస్యలపై తన గొంతును వినిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్న సమయంలో ఆయన పార్టీకి అండగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోయడంలో ఆయన పాత్ర ముఖ్యమైందని చెప్పవచ్చు. అలాంటి ఆయనకే ఈరోజు గడ్డుకాలం ఎదురయిందనే వాదనలు బలంగా వినబడుతున్నాయి.

ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి…

జగిత్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై, తనకు సమాచారం ఇవ్వకపోవడం, ఎమ్మెల్యే పార్టీలో చేరడంతో తనతో సంప్రదింపులు చేయక పోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకానొక దశలో తన సన్నిహితుల వద్ద తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి చెప్పినట్లు హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, పార్టీ పెద్దలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న తన నియోజకవర్గంలో మరో పార్టీ నుండి చేరికల విషయమై తనతో చర్చించకపోవడం, ఆయనను ఆవేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పట్టబదుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తాను ఆ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయమై సన్నిహితులతో, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు

జగిత్యాల జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. తాజాగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పార్టీ సీనియర్ నాయకులు షాక్ కు గురయ్యారు. దీనికి తోడు పార్టీకి కష్ట కాలంలో తోడున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కసారిగా తన పదవికి రాజీనామా చేస్తారన్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇప్పుడు అదే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఇదే విషయం పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సోమవారం మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ల ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సీఎం ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.