90 Degree Bridge: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్లో నిర్మించిన రైల్వే వంతెన చర్చల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఆ రైల్వే వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి మీడియాలలో అనేక కథనాలు రావడంతో సోషల్ మీడియాలో కూడా దీని గురించి బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ వంతెన డిజైన్న రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఏడుగురు ఇంజనీర్లపై సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తుంది.
అలాగే ఈ వంతెన నిర్మాణంలో భాగమైన మరో విశ్రాంతిగా చీఫ్ ఇంజనీర్ పై కూడా ప్రభుత్వం శాఖా పరమైన విచారణకు ఆదేశాలను జారీ చేసింది. తాజాగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఐస్ బాగ్ లో ఆర్ఓబి నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అలాగే వచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని దీనికి సంబంధించిన ఎనిమిది మంది పిడబ్ల్యుడి ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారిలో ఏడుగురు ఇంజనీర్లపై తక్షణమే సస్పెన్షన్ అమలు చేసినట్లు అలాగే నిర్మాణం ఏజెన్సీ మరియు డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్ లను బ్లాక్లిస్టులో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఆర్ఓబి పునరుద్ధరణ కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
ఈ మధ్యకాలంలో రూ.18 కోట్లతో రాజధాని భోపాల్ లో ఐస్ బాగ్ దగ్గర ఒక రైల్వే వంతెనను నిర్మించడం జరిగింది. ఈ కొత్త వంతెన 90 డిగ్రీల మలుపు కలిగి ఉండడంతో ఇది సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలకు గురైంది. కానీ ఈ నిర్మాణ డిజైన్ ను నిర్మాణ సంస్థ సమర్ధించుకుంది. వివరణలో భాగంగా సమీపంలో మెట్రో రైల్వే స్టేషన్ ఉండడంతో అలాగే భూమి కొరత కారణంగా కూడా ఇలా నిర్మించడం జరిగిందని లేకపోతే మరో మార్గం లేదని నిర్మాణ సంస్థ వివరణ తెలిపింది. అదనపు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఈ నిర్మాణ మార్గం సవ్యంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వీటన్నిటిని తీవ్రంగా పరిగణించి ఇంజనీర్లపై చర్యలు తీసుకుంది.