* డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితుని ఆరోపణ..!
* గుడుంబా అమ్మకపోయిన వేధింపులు..?
* మామ బదులు కోడలు అదుపులోకి..!
* గుడుంబా అమ్మేవారిని వదిలి, తమపై కక్షతో వేధింపులు..?
* అడిగితే డబ్బులు ఇవ్వనందుకు నన్ను పగబట్టారు..!
* ఓ వికలాంగుడి ఆవేదన.. స్టేషన్ ముందు నిరసన..
Metpally: మెట్ పల్లి, జూలై 02 (ప్రజా శంఖారావం): సారు కాళ్లు లేవు కనికరించండని మొరపెట్టుకున్న ఆ ఆబ్కారీ ఉద్యోగి వేధించడం మాత్రం ఆపడం లేదని, తాను గతంలో గుడుంబా అమ్మకాలు జరిపానని, ప్రస్తుతం కాళ్లు రెండు చచ్చుబడిపోవడంతో గుడుంబా అమ్మకాలు చేయడం లేదని ఎంత ప్రాదేయపడ్డ ఆ ఆబ్కారీ ఉద్యోగి తనను వేధించడం ఆపడం లేదని ఒక వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు బోదాస్ రాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కన నివాసం ఉంటున్న బోదాసు రాములు ఇంటికి ఆబ్కారీ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో మహిళా కానిస్టేబుల్ బుధవారం వచ్చారని అన్నాడు. గుడుంబా అమ్ముతున్నవు అంటూ నీపై ఫిర్యాదులు వచ్చాయని చెబుతూ ఇల్లంతా వెతికారని, ఎక్కడ కూడా గుడుంబా ప్యాకెట్లు దొరకకపోవడంతో పాత విషయాలను మనసులో పెట్టుకొని కక్షతో తన కోడలు అశ్విని బలవంతంగా మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు ఆయన భార్య ఇద్దరు స్టేషన్ కు వచ్చి అన్యాయంగా తమ కోడలును అరెస్టు చేశారంటూ నిరసనకు దిగారు.
ఈ క్రమంలో బాధితున్ని ప్రశ్నించగా గతంలో కూడా హెడ్ కానిస్టేబుల్ తనను వేధించేవాడని, మూడు నెలల క్రితం అన్యాయంగా తనను గుడుంబా అమ్ముతున్నామంటూ కేసు నమోదు చేసి బైండోవర్ చేసిన సమయంలో తనను హెడ్ కానిస్టేబుల్ 1500 రూపాయలు డిమాండ్ చేశాడని, తాను 900 రూపాయలు కూడా సదరు హెడ్ కానిస్టేబుల్ కు ముట్ట చెప్పానని ఆరోపించాడు. ప్రతిసారి కావాలనే కక్షతో తమపై అమ్మకాలు చేయకపోయినా, గుడుంబా అమ్మకాలు జరుపుతున్న వారిని వదిలి తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని బాధితుడు ఆయన భార్య ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమను వేధింపుల నుండి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సిఐ వినోద్ రాథోడ్ ను వివరణ కోరగా డబ్బుల వ్యవహారం తనకు తెలియదని, బాధితుల వద్ద నుండి వివరాలు సేకరించి, ఆరోపణలు వచ్చిన సిబ్బంది పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.