Kamareddy: కామారెడ్డి/ ఎల్లారెడ్డి, జులై 06 (ప్రజా శంఖారావం): రాజకీయ కక్షతో కావాలనే, సంబంధం లేని కేసులో తన భర్త టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని తప్పుడు కేసులో ముందస్తు సమాచారం, ఎలాంటి నోటీసులు లేకుండా అన్యాయంగా అరెస్టు చేశారని కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. ఆదివారం ఆమె తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశమని, అలాగే తన భర్తకు వచ్చిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ పదవీ పై కొంతమంది అక్కస్సుతో ఉన్నారని, పదవి వచ్చినప్పటి నుండి తన భర్త పై కొందరు కావాలనే సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, తమ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత మూడు రోజుల నుంచి ప్రొబెల్స్ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్ కు తమకు ముడిపెడుతున్నారని, అసలు వీటితో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వెంచర్ లో తమకు ఒక గుంట భూమి కూడా లేదని ఆమె చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి తన భర్తకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చిందని, దీంతో తను వెళ్ళగానే 11 గంటలకు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు తనకు సమాచారం అందడంతో తను వెళ్లానని తెలిపింది.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అరెస్టు చేయడంపై ఆమె మండిపడ్డారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ వద్ద రిమాండ్ చేసి అక్కడి నుండి నిజాంబాద్ కు తరలించారని ఆమె చెప్పారు. శ్రీవారి వెంచర్ ను 2023 లోనే విభూస్ ఎకో టౌన్షిప్ వారికి డెవలప్మెంట్, లీజ్ అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ కేసులో తాము చట్టప్రకారం ముందుకు వెళ్తామని, చట్టంపై తనకు తమకు నమ్మకం ఉందని ఆమె తెలిపారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తానని ఆమె అన్నారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.