TDP: తెలంగాణలో తెలుగుదేశం పాగా.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణలో ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ రెండు దఫాలుగా అధికారం చేపట్టింది. ఏపీ లో మొదటిసారి తెలుగు దేశం, రెండు దఫా వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చింది. మూడో సారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో రెండోసారి కూటమి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వంలో తెలుగు దేశం పార్టీ భాగస్వామి కూడా . జాతీయ స్థాయిలో బీజేపీ తో జతకట్టడంతో ఆ పార్టీకి నైతిక బలం పెరిగింది. తెలంగాణలో కూడా పూర్వవైభవం సాధించాలనే తపన ఎప్పటినుంచో అధినేత చంద్రబాబు కు ఉంది. ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడంతోనే ఇప్పుడు అయన తన ఆలోచనకు పదును పెడుతున్నారు.
చంద్రబాబు రెండోసారి అధికారం చేపట్టడం, బీజేపీ తో కలిసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం చూసిన తెలంగాణ నాయకుల్లో కూడా ఆశలు చిగురించాయి. దింతో ఆయన ఆలోచనలను పసిగట్టిన కొందరు తెలంగాణ నేతలు ఏపీ కి వరుస కట్టారు. ఏకంగా కొందరు రాష్ట్ర అధ్యక్ష పదవినే కావాలన్నారు. అప్పుడు ఆయన సుతిమెత్తగా ఇంకా సమయం ఉందంటూ దాటవేశారు. అదే సమయంలో మాజీ కార్మిక మంత్రి బాబు మోహన్ చంద్రబాబు వద్ద కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పలువురు నాయకులు గతంలో టీడీపీ, ఆ తరువాత గులాబీ దళంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు కూడా అధ్యక్ష పదవిని ఆశించారు.
రాష్ట్రం విడిపోయిన తరువాత ఒంటరిగా తెలంగాణాలో పోటీచేసి 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన వారంతా కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైనది. ఉద్యమం సమయంలో కూడా టీడీపీ 2014 ఎన్నికల్లో 14.7 శాతం ఓట్లు సాధించి తన సత్తా ఏమిటో నిరూపించుకొంది. తెలంగాణ లో రాబోయే ఎన్నికల్లో పోటీచేయడానికి టీడీపీ ఉవ్విళ్ళు ఊరుతోంది. గతంలో టీడీపీ లో పనిచేసిన సీనియర్ నాయకులను జిల్లాకు ఒకరిని ముందస్తుగా ఎంపిక చేసి పెట్టారు చంద్రబాబు. ముందుగా ఆయన కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి ఎవరనే వేటలో పడ్డారు. అధ్యక్ష పదవిని భర్తీ చేసి తెలంగాణ లో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఆలోచనలు, ఎత్తుకు, పై ఎత్తులు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.