Lok Sabha: కేంద్ర ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న జనాభాతో సంబంధం లేకుండా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా సమానంగా లోక్ సభ స్థానాలను 20 శాతం పెంచాలని భావిస్తుంది. విశ్వసనీయ వర్గాల నివేదిక ప్రకారం ప్రభుత్వం జనగణన ఆధారంగా ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినట్లయితే జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణ రాష్ట్రాలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే దేశంలో 1971లో జనాభా లెక్కల అంచనా ప్రకారం మన దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది దాదాపు 145 కోట్లకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభ సీట్లను పెంచక తప్పదు అని భావిస్తుంది. ప్రతిపక్షాలు నియోజకవర్గాల సంఖ్యను స్తంభింప చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైన యోచన అంటూ తెలిపింది. జనన గణన లెక్కల తర్వాత మాత్రమే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిందో లేదో తెలుస్తుంది అని అప్పుడు మాత్రమే దీనిపై స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం జూలై 21 నుంచి ఆగస్టు 11 మధ్య జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమీలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు పూర్తి చర్యలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ సమావేశంలో ఇప్పటికే జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అలాగే మహిళలకు 33% కోటాపై స్పష్టత ఇవ్వాలని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు ముఖ్యంగా ఈ రెండు అంశాలను ముడి పెడుతూ దేశవ్యాప్తంగా 2029లో లోక్సభకు అలాగే అసెంబ్లీలకు రెండిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ వర్షాకాల సమావేశాలలో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.