Land Surveys: జిల్లాలో ఖరీదైన సర్వేలు.. రైతుల జేబులకు చిల్లులు..

Land Survey
Land Survey

Land Surveys: జిల్లాలో ఖరీదైన సర్వేలు.. రైతుల జేబులకు చిల్లులు..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 10 (ప్రజా శంఖారావం): కాలం కలిసి రాక.. భూ వివరాలు ధరణిలో సరిగ్గలేఖ.. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసి పోయిన రైతులకు న్యాయం జరగాలంటే జేబులకు చిల్లులు పడాల్సిందే.. గత ప్రభుత్వం మొదలుపెట్టిన ధరణి పోర్టల్ కొంత మంది రైతుల జీవితాల్లో దరిద్రమై.. తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి వివరాలు సరిగ్గా లేకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక చిరుజల్లుల కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతన్నకు నేల తడవకపోయినా కొంతమంది అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితిలు దాపురించాయి.

ఈ తతంగం మరెక్కడో కాదు నిజామాబాద్ జిల్లా లోని రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. అసలే పంట దిగుబడికి సరైన గిట్టుబాటు ధర లేదని పలుమార్లు రోడ్డేక్కిన జిల్లా రైతంగానికి రెవెన్యూ సర్వేయర్ల చేతివాటంతో జేబులకు చిల్లులు పడేలా చేస్తుంది. ధరణి పోర్టల్ లో ఉన్న తప్పులు సరిదిద్దుకోవడానికి రెవెన్యూ మండల సర్వేయర్లను రైతులు భూ సర్వే పేరిట ఆశ్రయిస్తున్నారు.

రెవెన్యూ శాఖ అప్రతిష్ట..

అందిన కాడికి దండుకో.. అందిందంతా దోచుకో.. అన్నట్లుగా ఉంది కొంతమంది సర్వేయర్ల తీరు. ఇలాంటి వారి తీరుతో రెవెన్యూ శాఖ అప్రతిష్టపాలవుతుంది. భూముల సర్వే కోసం మీ సేవలో టీపాన్ కట్టడానికి వెళ్తున్న రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టీ పాన్ కట్టే రైతులకు తమ భూముల సర్వేల కోసం వచ్చే సర్వేయర్లు సర్వే పేరిట దోచుకుంటున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమి సర్వే చేయడానికి డిఫ్ఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) వంటి అత్యాధునిక పరికరాలను వినియోగించాలని, వాటికోసం డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి కొంతమంది ప్రభుత్వ సర్వేయర్లు సుమారు ₹ 10 నుండి ₹ 15 వేల రూపాయల మేర వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినపడుతున్నాయి.

రైతుల వద్ద డబ్బులు వసూలు..

టీ పాన్ కు చెల్లించాల్సిన రుసుము బదులు సుమారు ₹ 1000 రూపాయలు తీసుకొని తామే మీ సేవలో టిపాన్ చెల్లించి, సర్వేకు నోటీసులు అందజేస్తామని చెబుతూ రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. తీరా సర్వే చేస్తామని చెబుతూ సర్వే కోసం అవసరమైన పరికరాలను ప్రైవేట్ సర్వేయర్ల వద్ద తీసుకురావాల్సి ఉంటుందని దానికి అయ్యే ఖర్చులను రైతులు భరించాలని చెబుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. చేసేది లేక రైతులు సుమారుగా ఒక ఎకరానికి ₹ 2-5 వేల రూపాయల వరకు డబ్బులను సర్వే పరికరానికి అయ్యే ఖర్చు పేరిట సర్వేయర్లు రైతుల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సర్వే పూర్తి అయిన తర్వాత అధికారికంగా ఇచ్చే సర్వే రిపోర్ట్ కోసం కూడా నాయనో.. భయానో ఎంతో కొంత ముట్టచెప్పకుండ సర్వే రిపోర్ట్ ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

జిల్లా కలెక్టర్ స్పందించాలీ..

భూమి కొలతల కోసం సుమారు ₹ 300 రూపాయలు మీ సేవలో టీ పాన్ కోసం కట్టడానికి అయ్యే ఖర్చు ఇలా సర్వేయర్ల కక్కుర్తి తో తడిసి మోపెడవుతుంది. రైతులు మీ సేవలో కట్టిన టీ పాన్ తో భూమి కొలతలతో పాటు సదరు భూమి యజమనీదా రులకు నోటీసులు జారీ చేసి సర్వే చేయాల్సిన రెవెన్యూ సర్వేయర్లు కొంతమంది డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సర్వే పేరిట రైతుల వద్ద అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నట్లుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. చేసేది లేక రైతులు కూడా వారు అడిగిన కాడికి డబ్బులను ముట్ట చెబుతున్నారు. ఈ వ్యవహార తీరుపై జిల్లా కలెక్టర్ స్పందించి విజిలెన్స్ విచారణ చేస్తే జిల్లాలోని సర్వేయర్ల బాగోతం బయటపడుతుందని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now