Leopard: చిరుతలకు ప్రాణ సంకటంగా మారుతున్న.. చంద్రాయన్ పల్లి ఫారెస్ట్..!

Leopard
Leopard

గత ఏడేళ్లలో మూడు చిరుతలు మృతి
గాయపడిన మరో చిరుత
చిరుతల సంరక్షణ కోసం చర్యలు చేపట్టని అటవీశాఖ..!
ఇప్పుడైనా అధికారులు మేల్కొనేనా..?

Leopard: నిజామాబాద్ జిల్లా, మే 07 (ప్రజా శంఖారావం): అడవిలో ఉండాల్సిన చిరుతలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి అటవీ రేంజ్‌ పరిధిలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో ఎండలు మండుతుండటంతో వన్యప్రాణులకు నీరు దొరకడం లేదు. దీంతో వన్యప్రాణులు, చిరుతలు నీరు కోసం రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి. సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో 2018లో రైలు ఢీకొని చిరుత గాయపడింది. దానికి చికిత్స అందించేందుకు అధికారులు హైదరాబాద్‌ తరలించగా వారం రోజులకే చనిపోయింది. దేవితాండా వద్ద జాతీయ రహదారిపై 2022 ఫిబ్రవరి నెలలో ఆర్టీసీ బస్సు ఢీకొని చిరుత మృతి చెందింది. గత సంవత్సరం చంద్రాయన్‌పల్లి, దగ్గి అటవీ ప్రాంతాల మధ్య కారు ఢీకొనడంతో ఒక చిరుత పులి తీవ్రంగా గాయపడింది. చంద్రాయన్‌పల్లి పెద్దమ్మ ఆలయం వద్ద 6 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో మరో చిరుత గాయపడింది. తాజాగా బుధవారం తెల్లవారుజామున చంద్రాయన్‌పల్లి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మూడేళ్ల వయస్సు గల చిరుత మృతి చెందింది.

జాతీయ రహదారిపైనే అధికం..

ఇందల్వాయి మండలం మీదుగా 44వ జాతీయ రహదారి వెళుతుంది. మార్గంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే చిరుతలు ఎక్కువగా ఈ హైవేపైనే మృతి చెందుతున్నాయి. వాహనదారులు రాత్రిపూట అతివేగంగా వాహనాలు నడుపుతూ వన్యప్రాణులను ఢీకొంటున్నారు. దీంతో మూగజీవాలు బలి అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిరుతలు మృతి చెందాయి. అటవీ ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

అడవిలో చెట్లు నరకడంతో..

అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు అడవులను వదిలి బయటకు వస్తున్నాయి. గత పది రోజుల క్రితం ఆర్మూర్ పట్టణంలోని సుప్రసిద్ధ నవనథ సిద్దుల గుట్టపై ఓ చిరుత కనిపించి హల్చల్ చేసింది. తరచూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేసి వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అయినా సంబంధిత అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు వేసవిలో వన్యప్రాణుల తాగునీటి కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతూ ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి.

కంచె ఏర్పాటు చేయాలి..

చంద్రాయన్‌పల్లి నుంచి దగ్గి వరకు సుమారు 5 కిలోమిటర్ల వరకు 44వ జాతీయ రహదారికి ఇరుపక్కల దట్టమైన అడవి ఉంది. దీంతో వన్యప్రాణులు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రమాదాల బారీన పడుతున్నాయి. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచె ఏర్పాటు చేయాలని, అలాగే అవి రోడ్డు దాటడానికి కొన్ని ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా జంతు సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఇలాంటి ఘటనలు అవుతూనే ఉంటాయి. దీంతో రాష్ట్రంలో చిరుతల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం కూడా ఉందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చిరుతలు, వన్య ప్రాణుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now