Illegal Structures: కెనాల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు బాధ్యులు ఎవరు..?
*** విచ్చలవిడి నిర్మాణాలపై అధికారుల ఆదుపేది..
** అసైన్మెంట్ భూములలో యథెచ్చగా నిర్మాణాలు
* అమాయకపు జనాలను బురిడీ కొట్టిస్తున్న బిల్డర్లు
* సంబంధిత శాఖ అధికారుల మొద్దు నిద్ర
ఆడ్రా..వస్తే రోడ్డున పడే జనాలకు దిక్కెవరు
డబ్బుకు కాదేది దాసోహం.. చేతిలో సొమ్ముంటే చక్రం తింపేయోచ్చని బిల్డర్ల బిల్డప్.. మసిపూసి మారేడు కాయ చేస్తున్న బిల్డర్ల బాగోతం.. అమాయకపు జనాలను బురిడీ కొట్టించి బఫర్ జోన్, అసైన్మెంట్ స్థలాలలో దర్జాగా భవంతులను నిర్మించి కట్టబెడుతున్న బిల్డర్ల బాగోతంపై అధికారులు మొద్దు నిద్ర.
అనుమతులు ఒకటి తీసుకుని నిర్మాణాలు మరొకటి చేపడుతున్న పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం.. వెరసి అమాయకపు జనాలు మోసపోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. తీరా చేతులు కాలాక అమాయకపు జనాలు మోసపోయామని తెలుసుకొని రోడ్డున పడితే బాధ్యులెవరు..? మరి అలా జరగకుండా కాపాడాల్సిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై ప్రత్యేక కథనం..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మార్చి 30 (ప్రజా శంఖారావం): యథేచ్చగా అక్రమ నిర్మాణాలను చేపడుతూ ఇరిగేషన్ కెనాల్ బఫర్ జోన్లలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అమాయకపు జనాలను మసిపూసి మారేడు కాయ చేస్తూ, అసైన్మెంట్ భూములలో నిర్మాణాలు చేపడుతూ నిలువునా దోపిడికి పాల్పడుతున్నారు కొంతమంది బిల్డర్లు. సంబంధిత శాఖల అధికారులకు అరచేతిలో వైకుంఠం చూయించి అందిన కాడికి కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న, సంబంధిత శాఖ అధికారులు అటువైపు వెళ్లి చూడడం లేదు కదా..! కట్టడాలను కూడా పరిశీలించకుండా పని కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.
కొంతమంది మంది అధికారులకు బిల్డర్లు నయానా.. భయానా.. ముట్ట చెప్పి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సంబంధిత నిర్మాణదారులు నిర్మాణాలు చేపట్టే సమయంలో అనుమతులు ఒకటి తీసుకొని నిర్మాణాలు మరొకటి చేపడుతున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అనుమతులు ఇచ్చాక నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో చూడాల్సిన అధికారులు అటువైపు కన్నీత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఎలాంటి ఎన్ఓసి (NOC) లు లేకుండా మార్ట్ గేజ్ రిలీజ్..
ఇరిగేషన్ కెనాల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ కార్యాలయంలో తాకట్టుపెట్టిన (మార్ట్ గేజ్) ప్రాపర్టీలను కూడా బిల్డర్లు సంబంధిత శాఖల ఎన్ఓసి లు లేకుండానే విడిపించుకుంటున్నారని సమాచారం. భవంతులు పూర్తయిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఓసీలు ఇవ్వాల్సిన సంబంధిత శాఖల అధికారులు వారి పర్యవేక్షణ సమయంలో ఏ విధమైనటువంటి ఎంక్వయిరీలు చేశారో అర్థం కావడం లేదు కానీ, కొంతమంది బిల్డర్లు నిర్మించిన బఫర్ జోన్ కట్టడాలకు కూడా సంబంధిత శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
రూపాయి.. రూపాయి.. పోగు చేసి కూడబెట్టుకున్న డబ్బును మధ్యతరగతి కుటుంబల వారు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్లు నిర్మించిన నిర్మాణాల వైపు మొగ్గు చూపుతు వారి మాయలో పడి మోసపోతున్నారు. ఇలా బిల్డర్ల చేతిలో మోసపోయామని తెలుసుకునే లోపు వారు అంతా కానిచ్చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ శాఖ వద్ద తాకట్టు పెట్టిన ప్రాపర్టీని రిలీజ్ చేసుకుని చేతులు ఎత్తేస్తున్నారు.
మరికొన్ని చోట్ల భవంతుల నిర్మాణ సమయంలో అడ్వాన్సులు తీసుకొని కొంతమంది చెప్పిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకుండా తూతూ మంత్రంగా నిర్మాణాలు చేసి ఫ్లాట్లను అప్పగిస్తున్నారని మరికొంతమంది వాపోతున్నారు. ఇదేంటనీ ప్రశ్నిస్తే దబాయిస్తున్నారని సమాధానం వినిపిస్తుంది. బిల్డర్లకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను రాబట్టుకోలేక సతమతమవుతూ న్యాయం జరగక బాధపడుతున్న వారు లేకపోలేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి ముఖ్య కారకులైన సంబంధిత శాఖ అధికారులు మొదట్లోనే అలాంటి నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి ఉంటే తాము మోసపోయే వారిమి కాదన్న వాదన బాధితులది.
ఇప్పటికైనా మున్సిపల్ శాఖ నుండి అనుమతులు పొందిన బిల్డర్ల నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులు ఒక కన్నెయ్యల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం మూలాన అమాయకపు జనాలు మోసపోతున్నారన్నది నగ్నసత్యం. ఇప్పటికైనా మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న నిర్మాణాలు, అపార్ట్మెంట్లను సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షిస్తారా..? లేక మనకెందుకులే అని వదిలేస్తారా వేచి చూడాలి..!.
అధికారుల సమన్వయ లోపం.. బిల్డర్లకు వరం..
సంబంధిత శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లకు వరంగా మారిందని చెప్పవచ్చు. ఒక శాఖకు మరో శాఖకు చెందిన అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం, నిర్మాణమవుతున్న అక్రమ కట్టడాలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో యథేచ్చగ నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణదారులకు మంచి వరంగా మారింది.
కొంతమంది ఫిర్యాదు దారులు ఒక శాఖలో ఫిర్యాదు చేస్తే ఇది తమ పరిధిలోకి రాదని, ముందుగా ఆ శాఖ వారు రిపోర్ట్ చేసి మాకు పంపితే చూస్తామని ఒక శాఖ వారు చెప్పడం.. మరో శాఖ వారి దగ్గరకు వెళ్తే ఇది మాది కాదని ఇది మరో శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు బదులు ఇవ్వడంతో ఫిర్యాదు చేసిన బాధితుల పుణ్యకాలం ఆఫీసులో చుట్టూ తిరగడానికే సరిపోతుంది. దీంతో బఫర్ జోన్, అసైన్మెంట్ స్థలాలలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న బిల్డర్లకు కాలం కలిసి వచ్చినట్లుగా కనబడుతుంది. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు కలిసి పని చేస్తారో లేదో..