LRS: ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కాపీల కోసం..! ఆపరేటర్ చేతివాటం..?
ఆర్మూర్ టౌన్, మే 03 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ సవరణలో భాగంగా గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారు తమ భూముల ధ్రువపత్రాలతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సిస్టంలో రుసుము చెల్లించిన తర్వాత స్థానిక మున్సిపల్, గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రొసీడింగ్ పత్రాలను సదరు భూమి యజమాని పొందాల్సి ఉంటుంది. కానీ అన్ని సక్రమంగా ఉండి ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన, భూమి పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే ప్రొసీడింగ్ పత్రాలు జారీ చేయడంలో సదరు కంప్యూటర్ ఆపరేటర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆపరేటర్ చేతివాటం..?
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఉండే ఓ కంప్యూటర్ ఆపరేటర్ ₹2 నుంచి 5 వేల రూపాయల వరకు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రొసీడింగ్ పత్రాలు జారీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సక్రమంగా ఉండి ఫీజులు చెల్లించిన కూడా ఏదో ఒక వంక చూపి మున్సిపల్ కార్యాలయం చుట్టూ పదేపదే ప్రదక్షిణాలు వేయాల్సి వస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానుల కోసం కేవలం ₹ 1000 రూపాయల ఎల్ఆర్ఎస్ ఫీజు పెట్టి, ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంటే ప్రభుత్వ ఖజానానికి వెళ్లే ఫీజు కంటే ప్రొసీడింగ్ కాపీ అందజేయడంలో చేతివాటం ప్రదర్శిస్తున్న వారి దోపిడి ఎక్కువైపోయిందని పట్టణవాసులు మండిపడుతున్నారు. చేతిలో ముడుపులు పెడితే తప్ప ప్రొసీడింగ్ పత్రాలు తమ చేతికి అందడం లేదని కొంతమంది బాధితులు వాపోయారు.
మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి..
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతుందా! అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని సక్రమంగా ఉండి సదరు భూలబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాల్సిన అధికారులే కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడమేంటని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఈ తతంగం పై మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించి సదరు ఆపరేటర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.