Tamilnadu Temple: దేవుడి హుండీలో 4 కోట్ల ఆస్తి పత్రాలు.. చూసి ఆశ్చర్యపోయిన ఆలయ అధికారులు..
ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బులు లేదంటే మొక్కుకున్న మొక్కులను, బంగారు నగలను వేయడం చూశాం. కానీ ఓ పెద్దాయన తన పిల్లలపై కోపంతో తన పేరుపై ఉన్న 4 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలను దేవుడు హుండీలో వేశాడు. ఈ విషయం తెలిసిన ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం లోని పడవేడు గ్రామానికి చెందిన విజయన్ అనే ఆర్మీ ఉద్యోగి ఈ పని చేసినట్లుగా తెలిసింది. ఆ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహం జరిగి అత్తారింట్లో ఉంటున్నారు.
మాజీ ఆర్మీ ఉద్యోగి విజయన్ కు భార్య కస్తూరికి మధ్య ఏర్పడ్డ కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. దీంతో ఆయన మనోవేదనకు గురై ఒకరోజు రేణుకాంబల్ ఆలయానికి స్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. దేవుని దర్శనం చేసుకున్న అనంతరం తన పేరుపైన ఉన్న నాలుగు కోట్ల విలువచేసే ఆస్తి పత్రాలను దేవుడు హుండీలో వేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రేణుకాంబల్ ఆలయ హుండీ లెక్కింపు చేస్తున్న సమయంలో విజయన్ ఉదయం ఆలయానికి వచ్చాడు. ఆలయ అధికారులను సంప్రదించి తనకు చెందిన నాలుగు కోట్ల విలువచేసే ఆస్తి పత్రాలను హుండీలో వేశానని, తన కుమార్తెలు నిత్యం ఆస్తికోసం వేధిస్తుండడంతో తనకు ఏమి చేయాలో అర్థం కాక ఆస్తి పత్రాలను దేవుడు హుండీలో వేసినట్లు అధికారులకు ఆయన వివరించాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. హుండీ లెక్కింపు సమయంలో బయటపడ్డ ఆస్తి పత్రాలను చూసి అంతా అవ్వక్కయ్యారు. ఈ విషయం తెలిసిన విజయన్ భార్య, కుమార్తెలు కూడా ఆలయానికి వచ్చారు. తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలు తమవని తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులను సంప్రదించి అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు హుండీలో వేసిన ఆస్తి పత్రాలు తమ వద్ద ఉంటాయని ఆ కుటుంబ సభ్యులకు అధికారులు స్పష్టం చేశారు. కానీ విజయన్ మాత్రం తనకు చెందిన ఆస్తి మొత్తం దేవుడి పేరుపై రాసి ఇచ్చేస్తానని ఆలయ అధికారులతో చెప్పారు. జరిగిన ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు నివ్వెరపోయారు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.