TUFIDC FUNDS: పర్యవేక్షణలో పత్తాలేని అధికారులు

TUFIDC FUNDS
TUFIDC FUNDS
* టియుఎఫ్ఐడిసి నిధులతో పనులు..
* పనుల నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ కరువు..
* కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగంలో నిర్లక్ష్యం పాగా
* ప్రజారోగ్య, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై జనం మండి పాటు

TUFIDC FUNDS: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జులై 11 (ప్రజా శంఖారావం): ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధులచే నిర్మించబడుతున్న కట్టడాల మీద ఓ కన్నెయ్యల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. దీంతో కట్టడాల నాణ్యత లోపం నిర్మాణాలకు శాపంగా మారింది. ఒక పక్క ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే అధికారులు కాంట్రాక్టర్లకు మడుగులు ఒత్తిన పరిస్థితి నెలకొంది. నిధులు మంజూరు అయి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ దానిని పరిశీలించాల్సిన అధికారులు మరోపక్క నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని గూండ్ల చెరువు, మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులకు జిల్లా మాజీ ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గూండ్ల చెరువుకు 4 కోట్లు రూపాయల నిధులు టియుఎఫ్ఐడిసి నుండి కేటాయించగా, మామిడిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి కోటి 43 నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు ప్రజారోగ్య, స్థానిక మున్సిపల్ శాఖల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ప్రజారోగ్య శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు పనుల నాణ్యత పై పర్యవేక్షించకపోవడం పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం పట్టణ సుందరీకరణలో భాగంగా గూండ్ల చెరువు వద్ద 4కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు జరుగుతు ఉంటే పనులను పర్యవేక్షించాల్సిన శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం కండ్లకు కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

పనుల్లో నాణ్యత లోపం..

హెల్త్ కేర్ సెంటర్ పనులలో కూడా నాణ్యత లోపిస్తున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన గోడలు నిర్మించే సమయంలో ఇసుక వాడకుండా డస్ట్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు స్థానికుల నుండి వినపడుతున్నాయి. గూండ్ల చెరువు వద్ద నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణంలో కూడా ఇదే తీరును పాటిస్తూ చెరువు వద్ద నిర్మించే గోడకు ఇసుకను కాకుండా నాణ్యతలేని మట్టి, డస్ట్ ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అలాగే చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న ఇనుప గ్రిల్ బిగించడంలో నిర్మించిన గోడకు గ్రిల్ కు మధ్య ఉన్న ఇనుప కడ్డీలు సరైన రీతిలో వెల్డింగులు చేయలేదని తూతూ మంత్రంగా బిగిస్తూ నాణ్యత లోపాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, గూండ్ల చెరువు వద్ద వేస్తున్న సిమెంట్ ప్లాట్ ఫారం కూడా నిర్లక్ష్యంగా నిర్మిస్తూ ఫ్లాట్ ఫారం కింద ఎలాంటి లేయర్ పనులు చేయకుండానే ఎర్ర మొరంపైనే కంకరతో సిమెంట్, డస్ట్, కంకర కలిపి ఫ్లాట్ ఫారం నిర్మాణం పనులు చేపడుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

చెరువు వద్ద నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు సరైన వాటర్ క్యూరింగ్ కూడా లేదని స్థానికులు మండిపడుతున్నారు. పట్టణంలో రెండు చోట్ల జరుగుతున్న అభివృద్ధి పనుల పై స్థానిక మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువైందనె వాదనలు ఉన్నాయి. ప్రజారోగ్య శాఖ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఆడింది ఆట పాడింది పాటగా ఉందని, అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అభివృద్ధి పనుల కాంట్రాక్టర్ అధికారుల మధ్య ఉన్న సైక్యతతో అధికారులు ఎవరు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ చేయకపోవడమే దీనికి కారణమా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పనుల విషయమై స్థానిక మున్సిపల్ కమిషనర్ ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతలోపాలను గుర్తించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా జిల్లా కలెక్టర్ చొరచూపాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now