Police: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 16 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పరిధిలోని ఓ పోలీస్ అధికారి యువకున్ని బెదిరించడంతో సదరు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. సదరు యువకుడు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ పోలీస్ అధికారి రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతుగా నిలబడి సదరు యువకునిపై బూతు పురాణం మొదలుపెట్టి, తనదైన స్టైల్ లో ఆ యువకున్ని హడలెత్తించినట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి.
మార్కెట్లో పేరుమోసిన వ్యాపారి కొడుకు కావడంతో సదరు యువకుడు ఆ పోలీస్ బాస్ దుర్భాషలకు, బెదిరింపులకు, భయపడి మార్కెట్లో తమ పరువు పోతుందనే భయంతో కాబోలు ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. తన మరణానికి సదరు పోలీస్ అధికారి కారణం అంటూ రక్తంతో చేయి పై రాసుకొని మరి ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా బాధితుని స్నేహితులు కొందరు తెలిపారు. పోలీసు అధికారులు ఆర్థికపరమైన లావాదేవీల్లో తల దూర్చడమే తప్పనుకుంటే, సదరు యువకుడ్ని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి బెదిరించడంపై బాధితుని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది.
సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పోలీస్ బాస్ అధికారిని సంప్రదించి సదరు బాధితునికి రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్య జరిగిన లావాదేవీల విషయంపై తనకు మద్దతుగా మాట్లాడి బాధితునిపై తనదైన స్టైల్ లో ఆ పోలీస్ అధికారి బెదిరిస్తే తన సమస్య పరిష్కారం అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పోలీస్ అధికారిని ఆశ్రయించినట్లుగా కనబడుతుంది. దీంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతుగా ఆ పోలీస్ అధికారి బాధితున్ని తన కార్యాలయానికి వినిపించుకొని బెదిరించడంతో మనోవేదనకు గురైన బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా బాధితుని స్నేహితుల ద్వారా తెలిసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడడంతో సదరు పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరుపై, ఈ ఘటనపై స్థానికులు చర్చించుకుంటున్నారు.