- అధికార పార్టీ నాయకుల బాహాబాహీ..
- ఫోటో లేదన్న కారణంతో పిడిగుద్దులు..
- మున్సిపల్ పరువు బజారుపాలు..
ప్రజల సమస్యలు చర్చించాల్సిన చైర్మన్ ఛాంబర్… వ్యక్తిగత అహంకారాల అఖాడాగా మారింది. ఫ్లెక్సీలో ఫోటో లేదన్న చిన్న కారణంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పిడిగుద్దులు గుద్దుకుంటూ బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధుల ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
NIZAMABAD: ఆర్మూర్, ఏప్రిల్ 16 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రస్థాయి నాయకుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నించిన మైనార్టీ నాయకున్ని, తన అనుచరులతో కలిసి ఓ కౌన్సిలర్ ఆ మైనార్టీ నాయకుడిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఒకరినొకరు దాడి చేసుకుని, పిడిగుద్దులు గుద్దుకున్నట్లు తెలిసింది.
మున్సిపల్ వైస్ చైర్మన్, ఎంఐఎం నాయకుడి సమక్షంలోనే మాటల యుద్ధం కాస్తా చేతుల దాకా వెళ్లి చైర్మన్ ఛాంబర్‌లోనే రగడగా మారింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ చివరకు పిడిగుద్దులు గుద్దుకోవడం మున్సిపల్ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసి, పరువును కాస్త బజారుపాలు చేసింది.
Also Read: Muncipal: నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!
అధికార పార్టీ నాయకుల బాహాబాహీ..
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు… ఫ్లెక్సీల్లో ఫోటోలు లేకపోవడంతో గొడవ పడటం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్‌లో కొంత మంది నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణల మధ్య ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ లో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని పట్టణవాసులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ గొడవలో గతంలో వివాదాల్లో ఉన్న ఆ ముగ్గురిలోని వర్గానికి చెందిన నాయకులే పాల్గొనడం గమనార్హం. ఈ ఘటనకు కారణమైన నాయకుడిపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో మిన్నకుండిపోతారో వేచి చూడాలి.
















