IPL 2025: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నవేళ ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నుంచి ఒక్కసారిగా మిస్సైళ్లు జమ్మూ పట్టణంతో సహా 16 ప్రధాన పట్టణాలపై దాడులకు తెగబడటంతో ప్రభుత్వ అధికారులు ఐపీఎల్ మ్యాచ్ ను అర్థంతరంగా ఆపేశారు. కానీ ఆ సమయంలో స్టేడియం లోపల తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రెండు రోజుల కింద పాక్ గగనతలం నుంచి ఇండియాపైకి రాకెట్ లాంచర్లు, మిస్సైళ్లలో దాడులకు తెగబడింది. ఈ సమయంలో జమ్మూతో కశ్మీర్ తో పాటు.. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కరెంట్ సప్లై నిలిపివేశారు. ఈ సమయంలోనే దర్మశాలలో కూడా మూడు ఫ్లడ్ లైట్లను ఆపేశారు. సాంకేతిక కారణాలతో ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయని అవి మళ్లీ వెలిగే అవకాశం లేదని చెప్పి ప్రేక్షకులను మెల్లిగా మెప్పించి పంపించేశారు. అసలు విషయం చెబితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లను తరలించడంలో మాత్రం అత్యంత చాకచాక్యంగా వ్యహరించారు. క్రికెటర్లను స్టేడియం నుంచి బయటకు తీసుకురావడం జాగ్రత్తగా హోటల్ లో ఉంచడం దగ్గర నుంచి ఢిల్లీ చేర్చే వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సడెన్ గా పాకిస్థాన్ దాడులకు తెగబడటంతో ధర్మశాల ఎయిర్ పోర్టును ముందస్తుగా మూసివేశారు. అనంతరం మ్యాచును రద్దు చేశారు. ప్రేక్షకులను పంపించేశారు. క్రికెటర్లను ఢిల్లీకి చేర్చేందుకు ముందుగా రైళ్లలో పంపించాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉదయం హోటళ్ల నుంచి క్రికెటర్లను ధర్మశాలలోని రైల్వే స్టేషన్ కు పంపించడంలో భద్రతా సిబ్బంది, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. క్రికెటర్లందరినీ ఒకే బస్సులో కాకుండా రెండు జట్లలోని సిబ్బంది, ప్లేయర్లను రైల్వే స్టేషన్ చేర్చడానికి ఏకంగా 50 వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో వెహికల్ లో కొంతమందిని చేర్చుతూ చివరకు అందరినీ సేప్ గా రైల్వే స్టేషన్ కు చేర్చారు. ఈ సమయంలో క్రికెటర్ల వెహికల్స్ ను భద్రతా సిబ్బంది వెహికల్స్ అనుసరించాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే స్టేషన్ చేర్చిన తర్వాత వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో క్రికెటర్లను ఢిల్లీకి చేర్చారు. వీరిని ఢిల్లీకి చేర్చడంలో పూర్తి ప్రణాళికతో వ్యవహరించారు. ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో క్రికెటర్లను సేఫ్ గా ఢిల్లీకి చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.