New Ration Card: గడిచిన కొన్ని సంవత్సరాలుగా జారీకాని రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల మంజూరి కోసం దరఖాస్తు చేసుకున్న.. ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆయా లబ్ధిదారులకు ఉగాదిలోపు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఓ గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈనెల 1 నుంచి కొత్త కార్డుల జారీకి శ్రీకారం చుట్టాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఉగాది నుంచి కార్డుల జారీకి ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. అయితే తాజాగా.. రేషన్ కార్డుల అఫ్లికేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన, ప్రజావాణి, ప్రత్యేక గ్రామసభలు, కుల గణన సర్వే సమయంలో దరఖాస్తులు తీసుకోగా.. ఇటీవల మీ సేవ కేంద్రాల ద్వారా కూడా అఫ్లికేషన్లు అర్హులైన లబ్ధిదారుల నుండి స్వీకరించారు.
మీ సేవ కేంద్రాదల ద్వార స్వీకరించిన అఫ్లికేషన్లపై సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దరఖాస్తులపై క్షేత్రస్థాయి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విచారణ బాధ్యతలను తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు అప్పగించారు. సివిల్ సప్లై అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ నేరుగా వెళ్లి… క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఈ విచారణలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అర్హులని తేలితే వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులతో పాటు కారు, బైక్, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ఇంటి ఓనర్ ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, వారి యెక్క నెలవారీ ఆదాయ వివరాలను సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరించనున్నారు.
తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ కసరుకులు పంపిణీ జరుగుతుంది. ఇవి కాకుండా మరో 20 లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మీ సేవ కేంద్రాల ద్వార 2.50 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులకు దర్ఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తే.. రాష్ట్రంలో మెుత్తం రేషన్ కార్డుల సంఖ్య కోటి వరకు దాటుతుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, పింఛన్లు, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకుంటున్న పరిస్థితుల్లో రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు.