September 15, 2024
Gold Smuggling

Gold Smuggling: ఎల్లలు దాటి.. జిల్లాలోకి పసిడి..!

Gold Smuggling: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 27 (ప్రజా శంఖారావం): గుట్టుచప్పుడు కాకుండా గడిచిన నాలుగు సంవత్సరాలుగా మండల కేంద్రంలో జరిగిన దొంగ బంగారం వ్యాపారం పై స్థానిక ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. సదరు సూత్రధారి వ్యాపారస్తుల వద్ద తీసుకున్న అడ్వాన్స్ డబ్బులతో కథ అడ్డం తిరిగింది. ఇప్పటివరకు సజావుగా జరిగిన వారి వ్యాపారంలో తీసుకున్న అడ్వాన్స్ తో వారిగుట్టు రట్టయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సూత్రధారితోపాటు వ్యాపారస్తులను విచారణ చేస్తున్నట్లు సమాచారం.

కథ అడ్డం తిరిగింది ఇలా..

2 కోట్ల రూపాయల మేర పసిడి కోసం ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ డబ్బులను సదరు సూత్రధారికి చెల్లించారు. అప్పటివరకు సజావుగా జరిగిన వీరి వ్యాపారం ఒక్కసారిగా బెడిసి కొట్టింది. ఓడలు బల్లవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి… అన్న చందంగా సదరు సూత్రధారికి అనుకున్న మేర పసిడి లభించలేదో ఏంటో తెలియదు కానీ తీసుకున్న అడ్వాన్స్ కు పసిడి ఇవ్వలేదు, తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ పరిస్థితిలో పసిడి కోసం అడ్వాన్స్ ఇచ్చిన వ్యాపారస్తులు సదరు సూత్రధారిపై ఒత్తిడి చేశారు. అసలు కథ ఇక్కడే అడ్డం తిరిగింది.

విలువైన భూమి రిజిస్ట్రేషన్..

పక్క జిల్లాలోని ఒక మండలంలోని బంగారం వ్యాపారస్తులు కొందరు కలిసి సదరు సూత్రధారికి అడ్వాన్స్ ముట్టజెప్పారు. అందులోంచి ఒకరు సూత్రధారిపై ఒత్తిడి పెంచి ఇచ్చిన రెండు కోట్ల రూపాయల అడ్వాన్స్ డబ్బులకు బదులు అంతే విలువైన భూమిని తన పేరుపై సదరు సూత్రధారితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం మిగతా వారికి తెలియదు కాబోలు. యధావిధిగా వారు సూత్రధారిపై ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుల కోసం కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తూ వచ్చారు. కానీ నిజం ఎన్ని రోజులు దాగి ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు బయట పడాల్సిందే కదా!

వారం రోజుల క్రితం నిజం బట్టబయలు..

మిగతా వ్యాపారస్తులు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో చేసేది లేక జరిగిన విషయాన్నీ సూత్రధారి మిగతా సభ్యులకు చెప్పేశాడు. దీంతో వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సదరు బంగారం వ్యాపారితో మిగతా వారికి తెలియకుండా ఒక్కడివే ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటావని గొడవకు దిగారు. అసలు వారు చేసింది దొంగ లావేదేవీలు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా కథ ముగిద్దాం అనుకున్నారు.

కానీ ఆ నోట ఈ నోట జిల్లాలోని ఆ మండలంలో వారి దొంగ బంగారం లావాదేవీల గొడవ దారలంగా వ్యాపించింది. ఈ విషయంపై మండలంలోని పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా సంవత్సరాల తరబడి సాగించిన దందాతో రాటు తేలిన వ్యాపారస్తులు అధికారులను ఏ విధంగా మేనేజ్ చేశారో తెలియదు కానీ ఆ విషయంపై విచారణ మధ్యలోనే నిలిచిపోయిందని జనాలు గుసగుసలాడుతున్నారు.

జనాల్లో జోరుగా చర్చ..

మరి ఇంత పెద్ద మొత్తంలో సదరు సూత్రధారికి బంగారం ఎలా వచ్చింది? జిల్లాలోని మండలంలో ఉన్న బంగారు వ్యాపారస్తులు కోట్ల రూపాయల మేర లావాదేవీలు ఎలా జరిపారు? అన్న విషయాలపై ఇంటలిజెన్స్ వర్గం లోతుగా విచారణ చేస్తే తప్ప, గుట్టు చప్పుడు కాకుండా చేసిన దొంగ బంగారం లావాదేవీలు బట్టబయలు కావని జనాలు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *