MLC Kavitha Deadline: నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 22 (ప్రజా శంఖారావం): పసుపు పంట పై బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పసుపు రైతులతో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేరుకే గెజిట్ జారీచేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, బోర్డుకు చట్టబద్ధత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపుకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డుకు చట్టబద్ధత ఉంటే విదేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, దీంతో స్థానికంగా పసుపు కు మంచి రేటు వస్తుందని చెప్పారు.
నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పారు. మార్కెట్ యార్డ్ కు మంచి నాణ్యత గల పసుపు తీసుకువచ్చిన రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పసుపు కు 12వేల కనీస ధర కల్పిస్తామని హామీ ఇచ్చారని, తక్కువ ధర ఉంటే బోనస్ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ పసుపు కు వెంటనే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మార్చి 1 తర్వాత జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బందిస్తామని ఆమె హెచ్చరించారు. పసుపు బోర్డు కు చట్టబద్ధత, కనీసం మద్దతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. దీనస్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.