– పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం..
– పారిశుధ్యంపై ఫిర్యాదులు చేసిన స్పందించని అధికారులు..
– ముసుగు కప్పుకున్న చెత్త సేకరణ బండ్లు..
– వివరణ కోరదామంటే స్పందించని కమిషనర్..!
– అటకెక్కిన అధికారుల పాలన..!
Muncipality: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూలై 25 (ప్రజా శంఖారావం): పారిశుధ్యంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్న అధికారుల మాటల్లో నిజం లేదని వార్డులోని పారిశుద్ధ్య లోపాలను చూస్తే అర్థమవుతుంది. ప్రచారాలు పెదవి దాటిన.. పారా, గమేళా పనుల దరికి చేరక పారిశుద్ధ్యం పడకేసింది. జనవరి 23 తో ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో నాటి నుండి నేటి వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ స్థానికంగా వార్డులలో ఉన్న మురికి కాలువలు, చెత్త సేకరణలో అధికారుల పాలన విఫలమైందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో కొన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం తాండవం చేస్తుంది.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. స్థానికంగా వార్డులలోని డ్రైనేజీ, చెత్త సేకరణ విషయంలో అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలంటూ విస్తృత ప్రచారాలు చేస్తున్న, క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఒకే దగ్గర చెత్తను సేకరిస్తున్నారు. దీనిపై కఠినంగా ఉండాల్సిన అధికారులు, సిబ్బంది నామ మాత్రంగా పనులు చేస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణకు వాహనాలు కొరత ఉండటం వల్ల రెండు, మూడు రోజులకోసారి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.

Also Read: నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం..
పలు వార్డుల్లో మురికి కాలువల్లో చిత్త పేరుకుపై డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతుంది. చెత్త సేకరణ సమయంలో గల్లీలలో కుప్పలు చేసిన చెత్త ఎత్తకపోవడంతో చిందరవందరగా రోడ్లపై పడిపోతుంది. దీంతోపాటు మురికి కాలువల పక్కన అలలు మొలిచి డ్రైనేజీలలో నీళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో సాయంత్రమైందంటే దోమల బెడద ఎక్కువవుతుందని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న హుస్నాబాద్ వార్డులో బంగారం వ్యాపార సముదాయాల గల్లీలో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. అలాగే రాజారాం నగర్, మామిడిపల్లి, గోల్ బంగ్లా, మల్లారెడ్డి చెరువు శివారు, తదితర వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ముసుగు కప్పుకున్న చెత్త సేకరణ బండ్లు..
బల్దియా నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలు సైతం మరమ్మత్తులకు వచ్చి మూలకు చేరుతున్నాయి. వాటికి రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకొస్తే పలు కాలనీల్లో సమస్యలు తీరనున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పుర పాలక సంఘం ఆవరణలో మూలకు చేరుతున్న వాహనాలు తుప్పు పట్టి పోతున్నాయి. ప్రజల సొమ్ముతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన చెత్త సేకరణ బండ్లు రిపేరికు నోచుకోకపోవడంతో గల్లీలో చెత్త సేకరణకు సమస్యలు తలెత్తుతున్నట్లుగా తెలుస్తుంది.
మున్సిపల్ లో ఉపయోగించే మున్సిపల్ వాహనాల పేరిట లక్షల్లో డీజిల్, మెకానిక్ రిపేర్ ఖర్చు చూపిస్తున్న కొన్ని వాహనాలు ముసుగేసి మూలన ఉంచడంపై కూడా పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను వసూలు విషయంలో లక్షల్లో పన్ను వసూలు చేసి ఇంత శాతం అంత శాతం వసూలు చేశామని ప్రగల్బాలు చెబుతున్న అధికారులు చెత్త సేకరణ బండ్ల మరమ్మత్తుల విషయంలో లక్షల్లో ఖర్చులు చూపెడుతున్న, మరి బండ్లు రిపేర్ ఎందుకు కావడం లేదని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ వార్షిక ఆడిట్ విషయంలో కూడా లెక్కలు ఏం తేలాయో? నని కొంతమంది గుసగుసలాడుతున్నారు.

Also Read: ప్రాపర్టీ టాక్స్ బకాయి ఉన్న సీడ్స్ కంపెనీ సీజ్
అటకెక్కిన అధికారుల పాలన..!
మున్సిపల్ ప్రజాప్రతినిధుల పదవీకాలం జనవరి 23 తో ముగియడంతో అప్పటినుండి ప్రత్యేక అధికారి లోకల్ బాడీ జిల్లా అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు పట్టణ పరిపాలన కొనసాగిస్తున్నారు. కానీ పారిశుద్ధ్య లోపం కళ్ళకు కొట్టొచ్చినట్లు కనబడడంతో అధికారుల పరిపాలన అటకెక్కిందని పట్టణవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణ కూడా కరువైందని పట్టణవాసులు వాపోతున్నారు. వార్డుల్లో అడపాదడపా కొన్ని వార్డులలో పర్యవేక్షణ చేయడం తప్ప, మురికి కాలువలు, చిత్త సేకరణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ వాసులు మండిపడుతున్నారు.

వివరణ కోరదామంటే స్పందించని కమిషనర్..!
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజును ప్రజా శంఖారావం ప్రతినిధి పారిశుద్ధ్య లోపంపై శుక్రవారం మధ్యాహ్నం 1:16 గంటలకు వివరణ కోరదామని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.