Scientist: వెబ్ డెస్క్, ఆగస్టు 16 (ప్రజా శంఖారావం): భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిస్సైల్ రూపకర్త భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డాక్టర్ రామ్ నారాయణ అగర్వాల్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో ఈనెల 15న ఆయన మృతి చెందారు.
ఈనెల 17న జరిగే ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో చేయాలని ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే 1983లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత్ మిస్సైల్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ అరుణాచలం లతో కలిసి ఆయన పని చేశారు. హైదరాబాదులోని అడ్వాన్స్డ్ సిస్టం లేబరేటరీ వ్యవస్థాపక డైరెక్టర్ గా కూడా ఆయన సేవలందించారు. 2005లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) లో విశిష్ట శాస్త్రవేత్తగా ఆయన పదవీ విరమణ పొంది హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఆయన ఉన్నన్ని రోజులు రక్షణ రంగానికి విశిష్ట సేవలను అందించిన మహోన్నత వ్యక్తి. దీనికి తోడు భారత లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీ రంగంలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించడంలో కూడా ఆయన సేవలు అమోఘం. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు ప్రముఖులు సంతాపం తెలిపారు