K Ramakrishna Rao IAS: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావును నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రామకృష్ణారావును కొత్త సిఎస్ గా నియమించారు. 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రామకృష్ణారావు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అనుభవం ఉండడంతో పాత సిఎస్ స్థానంలో ఈయనను నియమించినట్లు తెలుస్తుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పై మంచి అవగాహన, పట్టు ఉన్న ఈయనను సిఎస్ గా నియమిస్తే రాష్ట్రానికి ఆర్థికపరంగా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావు ఈ మేరకు కొత్త సిఎస్ గా రామకృష్ణారావును నియమిస్తూ ఆయా శాఖలకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈనెల 30న శాంతి కుమారి పదవి విరమణ ఉన్న నేపథ్యంలో సిఎస్ ఎంపిక కోసం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించింది. 1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు ప్రభుత్వం సిఎస్ గా ఫైనల్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది.