Collector’s Office: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 12 (ప్రజా శంఖారావం): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటుచేసిన ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి, అదనపు గదులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు నిజామాబాద్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.
జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అదనపు గదులు కేటాయించేందుకు, లబ్ధిదారులకు ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా షెడ్డును నిర్మించాలని కార్పొరేషన్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సభ్యులు తెలిపారు. అదే విధంగా వెల్నెస్ సెంటర్ లో మందుల సరఫరా, ఇతర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే ఫార్మసిస్టులను నియమించాలని, విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వెల్నెస్ కో-ఆర్డినేటర్ కృష్ణవేణికి సూచించారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, జిల్లా నాయకులు శిర్ప హనుమాన్లు, ప్రసాదరావు, రాధకిషన్ తదితరులు ఉన్నారు.