A student was attacked by a maniac: మెదక్ (కొల్చారం), నవంబర్ 04 (ప్రజా శంఖారావం): ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. గత 6 నెలలుగా ప్రేమ పేరిట వేదింపులకు గురి చేస్తుండగా, విద్యార్థిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
ఈ భయానక ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణ కేంద్రానికి చెందిన బాధితురాలు దివ్య కృప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వెళుతున్న సమయంలో చైతన్య అనే యువకుడు కత్తితో దాడి చేయగా, విద్యార్థిని ప్రతిఘటించింది.
గాంధీ ఆసుపత్రికి తరలింపు:
ఈ సమాచారం అందుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ యువకుడు గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో తన వెంటబడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.