December 13, 2024
ACB Attack
ACB Attack

ACB Attack: అవినీతి అధికారులపై ఏసీబీ పంజా..!

ACB Attack: హైదరాబాద్, ఆగస్ట్ 14 (ప్రజా శంఖారావం): తెలంగాణలో లంచావతారులను ఏసీబీ టార్గెట్ చేస్తోంది. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై దృష్టిసారించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 105 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా నేరుగా పట్టుబడిన కేసులే అధికంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. తనిఖీలు చేసి కేసు నమోదు చేస్తూ, దొరికిన సొమ్మును సీజ్ చేస్తున్నారు.

10 రోజుల వ్యవధిలో 6 కేసులను ఏసీబీ నమోదు చేసింది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో ఎక్కువ అవినీతి జరిగినట్లు గుర్తించారు. శివబాలకృష్ణతో మొదలయిన దాడులు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికితోడు ఏసీబీ నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్
హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ సూపరిండెంట్ నరేందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసునమోదు అయ్యింది. నరేందర్ ఇంట్లో రూ.2.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

సీసీఎస్ సీఐపై కేసు నమోదు

అలాగే సంగారెడ్డి సీసీఎస్ లో పని చేస్తున్న సీఐ వెంకట కిషోర్ రెడ్డిపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే, ఏసీబీ అధికారులు అంతకుమించి చాకచక్యంగా వ్యవహరించి ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు భూపాల్ రెడ్డితో పాటు కలెక్టరేట్ ఈ-సెక్షన్ అధికారి మదన్ మోహన్ రెడ్డి కూడా పట్టుబడ్డారు.

హైదరాబాద్ పట్టణ శివార్లలోని గుర్రంగూడకు చెందిన బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డికి చెందిన 14 గుంటల భూమి ధరణిలో ప్రొబిటెడ్ ఖాతాలో ఉంది. దీన్ని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులకు ముత్యంరెడ్డి వినతి పత్రం ఇచ్చాడు. పని అవ్వకపోవడంతో ముత్యంరెడ్డి ఈ సెక్షన్ అధికారి మదన్ మోహన్ రెడ్డిని కలవగా ఆయన పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 8 లక్షలకు ఒప్పందం కుదిరింది.

ఏసీబీ అధికారులను ఆశ్రయించి బాధితుడు

ఈ లంచం వ్యవహారం గురించి ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి మదన్ మోహన్ ను ముత్యంరెడ్డి కలిసి ఆ డబ్బు ఇచ్చారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. మదన్ మోహన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు మదన్మోహన్ రెడ్డి చెప్పారు.

మదన్మోహన్ వెంటనే భూపాల్ రెడ్డికి తన ఫోన్ నుంచి కాల్ చేశారు. గుర్రంగూడ భూమికి సంబంధించిన విషయంలో డబ్బు చేతికి అందిందని చెప్పగానే ఆ డబ్బు తీసుకుని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్దకు రావాలని భూపాల్ రెడ్డి సూచించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మదన్ మోహన్ ను కారులో డబ్బుతో వెళ్లాలని ఆదేశించారు. ఆవాహనాన్ని తమ ఏసీబీ అధికారులు కారులో అనుసరించారు. చెప్పిన చోటుకు వెళ్లి, అక్కడ రూ. 8 లక్షలు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి మదన్మోహన్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తర్వాతా భూపాల్ రెడ్డి, మదన్మోహన్ లను రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు.

మున్సిపల్ అవినీతి తిమింగలం

మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి తిమింగాలన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాసరి నరేందర్ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి వరకు జరిగాయి.

హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.3 కోట్ల నగదు (ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.1.10 కోట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే ఆయన ఇంట్లో ఉన్న 51తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు నరేందర్ ఆఫీసులో రూ.90వేలు దొరికాయి.

అధికారులు సీజ్ చేసిన నగదు, బంగారం, ఆస్తి పత్రాల విలువరూ ₹ 6,07,81,000. ఒక మున్సిపల్ ఉద్యోగి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. నోట్లను లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్ మిషన్లను ఉపయోగించారు. నిజామాబాద్ జిల్లాలో ఓప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం, ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. అవినీతికి పాల్పడిన నరేందర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!