September 15, 2024
raitu nirasana

Farmers protest: ఛలో ఆర్మూర్ సక్సెస్..

Farmers protest: ఆర్మూర్, ఆగస్టు 24 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పై రైతులు పెద్ద ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో రైతు రుణమాఫీ పై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన “ఛలో ఆర్మూర్” పిలుపు విజయవంతమైంది.
ఈ నిరసన, ధర్నా కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్ లోని గ్రామాల రైతులు వేల సంఖ్యలో పాల్గొని రుణమాఫీ పై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి నిరసన సక్సెస్ చేశారు. వచ్చేనెల సెప్టెంబర్ 15 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలకు పురిటిగడ్డ ఆయన ఆర్మూర్ నుండి రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

ఫ్లాకార్డులతో నిరసన

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రైతు నాయకులు దుయ్యబట్టారు. ప్రతి పంటకు ₹ 500 రూపాయల బోనస్, రైతు భరోసా ₹ 7500 రూపాయలు రైతులకు అందించాలని రైతులు ఫ్లాకార్డులు చేతుల్లో పట్టుకొని నిరసన తెలిపారు.

ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి..!

ప్రతి కుటుంబంలో అర్హులైన వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు లక్షల రూపాయల వరకు క్రాప్ లోన్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని అన్నారు. 2 లక్షల పైబడి బకాయి ఉన్న వారిని మిగతా డబ్బు కట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయించుకొండి అని చెప్పటం ఏంటని రైతులు ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతులు

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉన్న భూమి ప్రకారం భార్య పిల్లలపై భూములు ఉంటాయని, అదేవిధంగా క్రాప్ లోన్లు కూడా ఉండి సక్రమంగా బకాయిలు చెల్లిస్తున్న వారికి రుణమాఫీ వర్తించకుండా షరతులు విధించడం సమంజసం కాదని రైతులు వాపోయారు.
ఒక కుటుంబంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి భార్య పిల్లలు తల్లిదండ్రుల పేర్ల పై ఉన్న బ్యాంకు రుణాలను ఇంటి యజమానులకు జతకట్టి వారికి రుణమాఫీ వర్తించదని షరతులు విధించడం సరైన కాదన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల పేర్లపై వ్యవసాయ భూములు ఉంటాయని, అలాంటి వారికి రుణమాఫీ వర్తించదు అని చెప్పడం ప్రభుత్వ నిరంకుశ దోరణి అని రైతులు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి ఇప్పుడు ఆంక్షలు విధించడం ఏంటని వారు ప్రశ్నించారు. అంటే ప్రభుత్వం దృష్టిలో కుటుంబంలో ఒకరు తప్ప మిగతావారు రైతులు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు చెప్పకుండా రుణమాఫీ అందజేస్తామని చెప్పి, తీరా ఇచ్చే సమయానికి షరతులు విధించడం సమంజసం కాదని, చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 15 వరకు అల్టిమేటం జారీ చేసిన రైతులు

ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 వరకు రైతులకు రుణమాఫీ చేయాలని శనివారం తలపెట్టిన నిరసన ధర్నా కార్యక్రమంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గడువు లోపల అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యచరణ నాయకుల ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజు గౌడ్ తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైతు నాయకులు అందజేశారు.

సంఘీభావం తెలిపిన బాల్కొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ఛలో ఆర్మూర్ కార్యక్రమానికి, అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలన్న డిమాండ్ నేతృత్వంలో రైతులు తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమానికి బాల్కొండ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున రైతులకు సంఘీభావం తెలిపారు.

సందర్భంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను బేషరతు గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు మాటలు ఇచ్చి, దేవుళ్లపై ప్రమాణం చేసి, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటే అని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజీరెడ్డిలు మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమాలకు ఆర్మూర్ అడ్డా అని అన్నారు.

ఉద్యమాలకు ఆర్మూర్ అడ్డా

గతంలో ఎర్రజొన్న బకాయిల విషయంలో పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఆర్మూర్ రైతంగానికి ఉందని గుర్తు చేశారు. రైతులకు కావలసిన ప్రతి విషయంలో పోరాటం చేసి సాధించుకునే సత్తా రైతులకు ఉందని అన్నారు. అనుకున్నది సాధించేంతవరకు, రైతు రుణమాఫీ ఇచ్చేంతవరకు ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాధించుకుంటామని, అప్పటివరకు రైతులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రైతులకు సంఘీభావం తెలిపిన బిజెపి, వామపక్ష పార్టీల నాయకులు

ఛలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా రైతులు తలపెట్టిన నిరసన, ధర్నా కార్యక్రమానికి బిజెపి నాయకులు సైతం మద్దతు పలికారు. స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ రైతుల నిరసన ధర్నా కార్యక్రమానికి రాకపోయినా బిజెపి నాయకులు వారి ప్రతినిధులుగా బిజెపి నాయకులు పల్లె గంగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డిలు వచ్చి మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు బిజెపి పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకునే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని వారన్నారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే లతో కలిసి ఆర్మూర్ నుండి ర్యాలీని ప్రారంభించి, అన్ని జిల్లాల్లో రైతులను కలుపుకొని సెప్టెంబర్ 16న అసెంబ్లీని ముట్టడిస్తామని వామపక్ష పార్టీల నాయకులు దేవరం, ప్రభాకర్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జిల్లా సిపి నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు..

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నేతృత్వంలో రైతులు పిలుపునిచ్చిన ఛలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను దారి మళ్లించారు. ప్రధాన కూడలిలోని మామిడిపల్లి, పేర్కిట్, నేషనల్ హైవే లపై పోలీస్ బద్ద వస్తువు ఏర్పాటు చేసి రైతుల నిరసన ఉధృతం కాకుండా చూశారు. ఆర్మూర్ ఏసీపి బస్వారెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *