MLA Rakesh Reddy: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 06 (ప్రజా శంఖారావం): గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇక కొనసాగవని, ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో జరిగిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేస్తామంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ 2.0 నీటి పథకం కార్యక్రమంలో భాగంగా మంగళవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో పర్యటించారు.
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లు దింపి కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ 10 శాతం భూముల్లో, అసైన్డ్ భూముల్లో జరిగిన అక్రమ కట్టడాలపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత మున్సిపల్ అధికారులను 10 శాతం భూములపై నివేదిక ఇవ్వాలని కోరారు.
అలాగే మున్సిపల్ కు చెందిన 10 శాతం భూముల్లో జరిగిన కట్టడాలపై వివరణ కోరారు. ఇకనుండి ప్రభుత్వానికి చెందిన భూముల్లో ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మాణం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం తరహా అక్రమ కట్టడాలు తాను ఉపేక్షించనని పేదోళ్ల భూములపై పెద్దోళ్ల పెత్తనం ఇక సాగనివ్వనని పునరుద్ఘాటించారు. దీనికి అధికారులు కూడా సహకరించాలని, స్థానిక ప్రజలు కూడా 10 శాతం భూములను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ 10 శాతం భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.