Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ రాష్ట్రంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న కౌమార బాలికలకు పోషక ఆహారాన్ని అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కౌమార బాలికలకు పల్లి, చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కిలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇందిరమ్మ అమృతం పేరుతో నెల నెల అంగన్వాడి కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేసేలాగా చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 64.7% కౌమార బాలికలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం పేరుతో పోషక ఆహారంగా పల్లీ మరియు చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కిలను ప్రతినెల వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రోజుకు ఒకటి చెప్పనా ప్రతి బాలికకు నెలకు 30 చిక్కిలు అందుతాయి. ఒక్కో చిక్కిలో 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లు, 600 క్యాలరీలు అలాగే అవసరమైన మైక్రో న్యుట్రియెంట్లు ఉంటాయి. ఇందిరమ్మ అమృతం కిట్లను అంగన్వాడి కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ఒక్కో కిట్ లో 15 చిక్కిల చొప్పున నెలకు రెండుసార్లు అందజేస్తారు. ఆరోగ్య శాఖ ఈ బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు హెచ్బి పరీక్షలను కూడా నిర్వహించనుంది.