Vandalized trolley mirrors: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 17 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో వార్డులలోని చెత్తను సేకరించడానికి మున్సిపల్ నిధుల్లోంచి 3 నూతన ట్రాలి ఆటోలను కొనుగోలు చేశారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వాటిని పూలతో అలంకరించి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక 36వ వార్డుకు కౌన్సిలర్ బారడ్ రమేష్ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాలి ఆటో అద్దాలను ఆయన ధ్వంసం చేశారు. ఒక్కసారిగా జరిగిన హతఃపరిణామంతో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
అయితే స్థానికంగా 36వార్డులో చెత్త సేకరణ కోసం సంవత్సర కాలంగా పలుమార్లు కమిషనర్ రాజు కు 36వ వార్డు కౌన్సిలర్ విన్నవించుకున్న ఇప్పటివరకు తన వార్డుకు చెత్త బండిని కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించారు. తన వార్డులో చెత్త పేరుకుపోయి వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తన పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని కౌన్సిలర్ అసహనం వ్యక్తం చేశారు. మరికొంత మంది స్థానిక కౌన్సిలర్లు కూడా కమిషనర్ వ్యవహార తీరుపట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కమిషనర్ తీరుపై ఉన్నత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో లేదో చూడాలి. ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలను ప్రజా ప్రతినిధులు ధ్వంసం చేయడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ప్రజాధనం దుర్వినియోగంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.