Odela 2: ఓదెల చిత్రం కరోనా సమయంలో 2022లో ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా డైరెక్టర్ సంపత్ నంది ఓదెల –2ను తెరకెక్కించారు. తమన్నా కీలకపాత్రలో నటించిన ఓదెల –2 ప్రస్తుతం థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినపుడే సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీశారని తెలుస్తోంది.
కథనం: ఓదెల విలేజ్ లో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్యాచారానికి గురై చనిపోతుంటారు. అయితే వారు మరణించడానికి కారణం తిరుపతి (వశిష్ఠ సింహా) అని తెలుసుకుని అతడి భార్య రాధ ( హెబ్బా పటేల్) నరికి చంపుతుంది. అనంతరం అతడి తలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. దీంతో కొత్తగా పెళ్లైన నవ వధువుల్ని చంపుతున్న వాడి పీడ వదిలిపోయిందని గ్రామస్తులు సంబరపడిపోతుంటారు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. తిరుపతి సమాధి నుంచి ప్రేతాత్మగా మారి ఇతరుల శరీరాల్లో ప్రవేశించి మళ్లీ అత్యాచారాలు చేయడం మొదలు పెడతాడు. దీంతో కథ కొత్త రూపు తీసుకుంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత సీన్లు సగటు ప్రేక్షకులు ఊహించినట్లుగానే జరుగుతాయి. ఇక్కడ కథనం సాగిన తీరు నీరసంగా అనిపిస్తుంది. అయితే ఆ ప్రేతాత్మ నుంచి ఊరి ప్రజల్ని కాపాడటానికి తమన్నా శివశక్తి రూపంలో ఎంటరవుతుంది.
నటుల పనితీరు: తమన్నా, ప్రేత్మాత్మ మధ్య జరిగే సన్నివేశాలు బాగుంటాయి. అరుంధతి సినిమాలోని కొన్ని సన్నివేశాలను గుర్తుకుతెస్తాయి. (వశిష్ట సింహా) తిరుపతి క్యారెక్టర్ లో బాగా చేశాడు. ఉన్నది కాసేపే అయినా అతడి యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. బడ్జెట్ లో అవసరమైన రీతిలో గ్రాఫిక్స్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ టీం బాగానే పనిచేశారు. తమన్నాను సరొకత్త యాంగిల్ లో పరిచయం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది.
స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫస్టాప్ మొత్తంలో తమన్నా లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తుంది. సెకండాఫ్ లో కథనం ప్రేక్షకుడికి తెలిసేలాగా సాగడం కాస్త వారికి ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది. ఊరి మొత్తం దిగ్బంధం చేసిన సీన్, చిన్న పాపతో ఉన్న ఎలివేషన్ సీన్స్ ను ఇంకా బాగా తీయొచ్చు. ప్రమోషన్స్ లో సంపత్ నంది ముందుండి నడిపించిన విషయం తెలిసిందే. మంచి స్కోప్ ఉన్న స్టోరీని అంతే స్థాయిలో తెరపై కనిపించేలా చేయలేకపోయారన్నది ఆడియన్స్ అనుకుంటున్నారు. ఓవరాల్ గా.. ఓదెల 2 మూవీ ఆడియన్స్ ను అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పొచ్చు. అయినా కొత్తదనం కోసం ప్రయత్నించిన తీరును మెచ్చుకోవచ్చు.